మె'మోరి'న్ - 2
బ్రహ్మాజీరావు గారు అలా గుండెలు బాదుకుంటూ రావడానికి ఒక మూడు నిమిషాల ముందు.. 
భోగిమంట దగ్గర ముప్పర్తి సూర్రావుకి, బోణం బుచ్చిబాబుకీ మధ్య మాటలు... 
"ఈ సెగేంట్రా బాబా...అబ్బో.. బెమ్మాండం.. ఇలాంటి చెక్క ఇప్పుడు దొరకట్లేదు.. ఏంటి ?మంచి చెక్కరా.. ఎవరు ఇచ్చారో గానీ! " అన్నాడు సూర్రావు - మంట కి కొంచెం దూరంగా జరిగి వెనక వైపు శరీరానికి కాక పెట్టడానికి తిరుగుతూ. 
"మనోళ్లు మామూళోళ్లేంటి బాబాయ్.. ఇరగదీస్సారంతే... " అన్నాడు బుచ్చిబాబు మంట వేడి కళ్ళకి తగలకుండా చేతులు అడ్డం పెట్టుకుని.  
"ఎవరో గానీ ఆ మహానుభావుడు.. ఆళ్ళ ఇంటికెళ్లి దండేసి దణ్ణమెట్టాల్రా బాబా... " అన్నాడు సూర్రావు. 
మంటకి కొంచెం దూరంగా రామాలయం మంటపం పిట్టగోడ మీద కూర్చున్నపిండి నానాజీ అందుకున్నాడు. 
"ఇంటికెల్డం ఎందుకు... దండ రెడీ ఎట్టుకో.. ఆయనే వచ్చేత్తన్నాడు..." అని సూర్రావుకి చెప్పి చల్లగా జారుకున్నాడు. 
సూర్రావు అటు చూశాడు. సన్నగా ఉండే బ్రహ్మాజీ రావు గారు మహా స్పీడు మీదున్నారు. ఒక్క వేటుకి వందమందిని నరికే లెవెల్లో వుంది ఆయన నడకలో అడుగుల్లో కోపం. తలకంటే పెద్ద సైజులో మాఫ్లర్ చుట్టి.. పెద్ద దుప్పటి కప్పుకుని వస్తున్నారు. 
ఆయన్ని చూసి కొందరు కుర్రాళ్ళు సైకిళ్ళు తీసుకుని వెళ్లిపోయారు. 
మా నాన్న చంపెత్తాడ్రా బాబూ - అన్నాడొకడు. 
మా అమ్మ ఊరుకోదు - ఇంకొకడు. 
తల స్నానం చేసి కొత్త బట్టలేసుకోవాలి అని మరొకడు. 
నైటంతా నిద్దర లేదురా అబ్బాయి అని అడ్డాల బోసు గాడు. అందరూ జంపు. 
ఇంతకీ కుర్రాళ్ళు ముందు రోజు రాత్రి.. బాగా సెగ ఇచ్చిన ఆ చెక్కలున్న రెండు పెద్ద తలుపుల్ని తెచ్చి మంటలో వేసేశారు. పశువుల శాలకి పెట్టి.. కొంచెం కొంచెం గా విరిగిపోతున్నవి... ఎండకి ఎండి వానకి  తడిసి... 
మంటకి అవీ ఇవీ అని తేడాలు ఏముంటాయి..  అన్నిటినీ కలిపేసింది.
బ్రహ్మాజీ రావు గారు పాలేరుని తీసుకుని మాంచి మంటెక్కి మంట దగ్గరకొస్తే - అడగడానికి ఎవరూ లేరు. చెప్పడానికి లేకుండా అసలైనవాళ్లు అప్పటికే సర్దుకున్నారు. మంటల్లో ఉన్న తలుపుల్ని పాలేరు తీద్దామని ప్రయత్నం చేశాడు గానీ అప్పటికీ వాటికీ మంట అంటుకుంది. 
ఆయన గొడవ చేశారు. పోలీసుల్ని పిలుస్తానన్నారు. ఎవరీ పని చేశారో వాళ్ళని బొక్కలో వేయిస్తానన్నారు. 
సూర్రావుని అడిగితే తనకి ఏం తెలియదన్నాడు. ఊరి పెద్ద బళ్ల నరసింహ మూర్తి ముందే తేల్చుకుంటాను పిలవమన్నారు. సదరు ఊరి పెద్ద గారు దుప్పటి ముసుగేసి నాలుగో ఝాములో ఉన్నారు. బ్రహ్మాజీ రావు గారు చల్లార కుండానే ఇంటికి వెళ్లారు. 
చిన్నపిల్లలు వేస్తున్న పిడకల దండల్ని ఒక పెద్ద కర్ర తీసుకుని మంటలోకి సర్దుతున్నాడు కరెంట్ పోలు కిట్టిగాడు. 
డ్రెస్ అదిరిపోయిందిరా సుబ్బూ.. ఎక్కడ కొన్నావ్ ? అని ప్రేమ అడిగాడు ముప్పర్తి వాసు - సుబ్బుని. 
బట్టల కొట్లో... అని చెప్పాడు సుబ్బు. 
వాసు గాడికి మండింది. "ఛా.. మందుల కొట్లో అనుకున్నాన్లే.." అని సణుక్కుంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు వాసు.
మంటల్లో వేడినీళ్లు కాచుకుంటున్నారు. తెల్ల ఒంకాయలు కాల్చుకుంటున్నారు. వచ్చే పోయేవాళ్లు ఒకసారి చలి కాచుకుని వెళ్తున్నారు.  
ఇంతలో మంట కాస్త తగ్గింది. అన్నవరం అటూ ఇటూ చూసి.. వెళ్లి బాబూరావు టైలరింగ్ బడ్డీ ముందుండే చిన్న పందిరి తెచ్చి కుమ్ములో పడేశాడు.
బ్రహ్మాజీ రావు గారిని చూసి జారుకున్న జనాలు మళ్ళీ వచ్చి చేరారు మంట దగ్గర. 
మనం అనుకున్నది ఇంకొక్కటి మిగిలిపోయింది... అన్నాడు అడ్డాల బోసు గాడు. 
తడికలతో కట్టిన ఆనందంగాడి కాంపౌండ్ వాల్... గుర్తు చేశాడు బొండం రావుడు. 
కాస్సేపటికి ఆ తడిక.. ఆనందంగాడి ఇంటిని అనాధని చేసి మంటల్లో దూకేసింది. 
మెల్లగా ఊరు మేలుకుంది. కొత్త బట్టలు, తలంట్లు, ముగ్గుల శోభతో ఊరంతా ఎంత శోభాయమానంగా ఉందో !!
గోడలు కూడా కొత్త బట్టలు వేసుకున్నట్టు వున్నాయి.. కొత్త సినిమా పోస్టర్లతో. 
జట్కా బండ్లలో చుట్టాలు దిగుతున్నారు. సికింద్రాబాద్ నుంచి రావాల్సిన నర్సాపురం రయిల్లో ఇంకా రావాలి. 
తడికల్లేని తన ఇంటిని చూసి ఆనందం లబోదిబోమన్నాడు. మంట దగ్గరకొచ్చాడు. 
పాత తడికలు కదా... ఎప్పుడో మసి అయిపోయాయి. కాస్సేపటికి అతనూ వెళ్ళిపోయాడు. 
బాగా ఎండెక్కాకా.. టైలరింగ్ బడ్డీ తెరుద్దామని వచ్చిన బాబూరావు కి తన చిన్న పందిరి కనిపించకపోవడం తో బూతుల పురాణం అందుకున్నాడు. అన్నవరం గాడు ఆ దరిదాపుల్లో కనిపిస్తే ఒట్టు !
తరవాత బ్రహ్మాజీ రావు గారు కొత్త తలుపులు, ఆనందం కొత్త తడికలు వేయించుకున్నారు. 
పోయాయి.. మంటల్లో కలిసిపోయాయి.. మసై పోయాయి అనే విషయమే మర్చిపోయారు. 
కానీ బాబూరావు కి మాత్రం అతని బడ్డీ ముందు పందిరి పీకేసి మంటల్లో పడేసింది అన్నవరం గాడే అని ఎవరో ఉప్పు అందించారు. 
బడ్డీ లోకి ఎండ పడుతున్న ప్రతిసారి పురాణం తెరుస్తూనే ఉన్నాడు బాబూరావు.
వాళ్ళిద్దరికీ తరవాత పెద్ద తంటెం అయిపొయింది. భగ్గుమన్నారిద్దరూ. మాటా మాటా అనుకున్నారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. తరవాత తగ్గిపోయారు. అచ్చు భోగి మంట లాగే !!  
(కోటి సూర్యం.. కొత్త బట్టలు... ఒకరి కొలతలు ఇంకొకళ్ళకి... మరిన్ని జ్ఞాపకాలు... )
  
 
   
 
  
అన్ని నీవనుచు
 ఆంధ్రజ్యోతి వారపత్రిక నవ్య ఈ వారం సంచికలో నా కథ    "అన్ని నీవనుచు"    ప్రచురితమైంది. వీలైతే చదవగలరు. 
 
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి