మా ఊరి చుట్టూ ప్రజెంటెన్స్ పాస్టెన్స్
మోరి...
జాగ్రఫీ- కోనసీమ.
ఫోటోగ్రఫీ- చుట్టూ పచ్చదనం.. అటుపక్క గోదావరి అందం ... ఇటుపక్క సముద్రం... !!
భోగి పండగ రోజు ... టైం రఫ్ గా నాలుగు.. చలిని తట్టుకోవడం చాలా టఫ్ గా ఉంది.
మంచు తెర కప్పినట్టుంది ఊరంతా.
మకర్రాశిలోకి మారిన సూరీడు కొత్తిల్లు సద్దుకోడంలో హడావిడిలో ఉన్నాడేమో ... ఇంకా పైకి రాలేదు.
వీధులన్నీ కొత్త పెళ్ళికూతుళ్లలా అందంగా ఒద్దిగ్గా ముస్తాబై ఉన్నాయి. అప్పటివరకూ వాకిళ్ళని పేడతో అలికి, ముగ్గులతో సింగారించిన ఆడవాళ్లు కాస్సేపు నడుమువాల్చి చిన్న కోడి కునుకుతీసి వెంటనే మళ్ళీ లేచి పండగ సందడి మొదలు పెట్టారు.
గంగాళాలతో నీళ్లు గాడిపొయ్యలెక్కాయి. భోగి మంటలకంటే ముందే ఇళ్లల్లో ఈ మంటలు అందుకున్నాయి. చిన్న పిల్లలు చిన్నా చితుకూ ఖాళీల్ని ముగ్గులతో నింపేస్తున్నారు. నడవడానికి కాళ్ళు కాదుకదా వేళ్ళు కూడా పెట్టడానికి చోటులేకుండా.
నైట్ హాల్ట్ బస్సు డ్రైవరు, కండక్టరు రగ్గులు చుట్టేసుకుని, వణికిపోతూ బస్సు అద్దాల్లోంచి చూస్తూ కూర్చున్నారు.. భోగి మంట ఎప్పుడు వెలిగిస్తారా అని.
"చలపతిరాయ నికేతనం" లోంచి వెలివేల వెంకటాచలం గారు, గోపరాజు సుందరరావు గారు, గోపరాజు సూర్యనారాయణ మూర్తి గార్ల మగ పిల్లలు నిద్రకళ్లతో కిటికీ రెక్క తెరిచి కుమ్ము వెలిగించేశారేమో అని చెక్ చేసుకుంటున్నారు..
పండగ బట్టలు సమయానికి అందించడానికి ఆ రాత్రంతా మెలకువగా ఉన్న టైలర్ అడబాల సత్యనారాయణ, తలుపులు వేసేసిన కొట్లోంచి అప్పుడప్పుడు వచ్చి ఓ కన్ను ఇటు వేస్తూ తనపని చూసుకుంటున్నాడు.
దోమలకి అర్ధరాత్రి మెలకువ వచ్చేసి ఇక నిద్ర పట్టక తలకి మఫ్లర్ చుట్టుకుని రావిచెట్టు చప్టా మీద కూర్చుని చుట్ట కాలుస్తూ చలిని ఎదిరించాలానే ప్రయత్నంలో ప్రతి క్షణం ఓడిపోతున్న చింతపట్ల చిదంబరం అక్కడే కునికిపాట్లు పడుతూ కాసుక్కూచున్నాడు.
మోరి ఊరి మధ్యలో... ఓ పక్క అమ్మవారు.. ఇంకోపక్క రాములోరు; అటు పంచాయితీ దేవిడీ.. . ఇటు గ్రామసావిడి; ఓ వారగా నాటకాలేసే స్టేజీ, చెరోవైపున విఘ్నరాజు, సాయి మహారాజు.. ఆ మధ్యలో పేద్ద ఖాళీ స్థలం. అక్కడ. కరెంట్ వైర్ల మంట తగలకుండా, పక్కనే ఉన్న రావి చెట్టు ఆకులకి సెగ తగలకుండా సరిగ్గా మధ్యలో... !! భోగి మంట స్థలం.. ఎన్నో ఏళ్లుగా.. ఇప్పుడు కూడా.. అదే లెంగ్త్.. అదే విడ్త్.
నెలపట్టిన రోజు నుంచీ ఇంటింటికీ వెళ్లి అడిగితే వాళ్ళు వేసినవి, అంతకుముందురోజు రాత్రి వరకు ఎక్కడెక్కడివో వీలైనంత పోగేసి, అక్కడ అప్పటికే సిద్ధం చేసిన పాత సామాను కుప్ప వెలగడానికి సిద్ధంగా ఉంది.
లావు దుంగల దగ్గర నుంచి, సన్న వెదురు బద్దల వరకు, కొబ్బరాకుల నుంచి బండి చక్రం ఆకుల వరకు... మాజీలు అయిపోయిన ద్వారబంధాలు, కిటికీలు మొదలు కుంగి కృశించిపోయిన కుర్చీలు, ఆకారాలు వికారాలైన బెంచీలు, తడిసి తడిసి తమలపాకుల్లా తేలిన తలుపు చెక్కల దాకా... కొబ్బరి కమ్మలు, డొలకలు, డొక్కలు, తాటిమట్టలు, సర్వే బోదెలు, పందిరిరాటలు.. చిక్కిపోయిన చెక్క బీరువాల అవశేషాలు, నిలబడ్డానికి ఓపిక లేక గడగడలాడుతున్న గెడంచీలు ... పడుకున్నవాడి నడుము విరక్కుండా మంచానికి వీడుకోలు చెప్పిన మంచం కోళ్లు, తాకితే తమకాలుపోయే తడికెలు, వంకర టింకర్లతో వొయ్యారాలు ఒలకబోసే వాసాలు... ఇలా ఎవరు ఏది వేస్తే అది.. మండడానికి ఏది పనికొస్తుందో అది.. ఆలా అన్నీ కలిసి ఒక భోగిమంట.
ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికి ఒక మాల అయినట్టు... !!
ప్రతి సంవత్సరం ఊరి పెద్ద బళ్ల నరసింహ మూర్తి కుమ్ము వెలిగించడం ఒక ఆనవాయితీ. నరసింహ మూర్తి వచ్చేసరికి అర లీటర్ కిరసనాయిలు, ఒక అగ్గిపెట్టి సిద్ధం.
అలా భోగిమంట వెలిగిందో లేదో.. జనం చేరేవారు. చిటపటాలూ చురచురాలూ వేడిగా పిలిచినట్టు.
ఆ చలిలో... వెచ్చదనం కోసం తహతహలాడే శరీరానికి ఏకంగా చెయ్యెత్తు మంట...
వాన అడిగితే వాయుగుండాన్ని ఇచ్చినట్టు !!
పోతురాజు సూర్రావు, పేరాబత్తుల సుబ్బారాయుడు, సున్నితంగారి రెండోవాడు కృష్ణ, చోడియ్యగారి అబ్బాయి జవహర్ లాల్, పెద్ద పంతులుగారి కన్నయ్య, సూరబ్బాయిగారి చిన్నోడు నాని, అప్పటికే స్నానాలు గట్రా చేసేసి పిడకల దండలతో రెడీగా ఉన్న పిల్లలు... అక్కడే పెద్ద తీర్థంలా ఉంది.
మనుషులు పెరిగారు. పిడకల దండాలు పెరిగాయి. ఆ మంటల్లో నీళ్లు కాచుకుంటున్నారు. వంకాయలు కాల్చుకుంటున్నారు.. పచ్చడికోసం.
ఈ లోగా ఆచార్లుగారు రామాలయం తెరిచి డివ్విట్టం డివ్విట్టం అనే వాయిద్యంతో, ఒక కాగడా పట్టుకుని ఇత్తడి బిందె చంకలో పెట్టుకుని కాలవకి వెళ్ళారు. మర్యాదా పురుషోత్తముడికి, రామచక్కని సీతమ్మకి స్నానం చేయించడానికి.
నైట్ హల్ట్ బస్సు వెళ్ళిపోయింది. ఫస్ట్ బస్సు వచ్చింది. బిలబిలా మంటూ దిగారు జనాలు. ఆడపడుచులు, అల్లుళ్ళు, బంధువులు.. కొత్త బట్టలు వేసుకుని. దిగిన వాళ్ళు ఒకసారి చలి కాచుకుని దేవుళ్ళకి దణ్ణాలు పెట్టుకుని తలో దారిలో వెళ్లేవారు... అటు వీరా వారి మెరక, ఇటు శృంగవరప్పాడు వైపు, అటు గుడి పక్కనించి అడ్డాలోళ్ళ ఇళ్లవైపు.. ఇలా !!
కొంచెం వెలుగువచ్చింది. మంచు తగ్గింది. మంట బాగా పెరిగింది. దగ్గరగా ఉన్న జనాలు దూరంగా జరిగారు.
ముందుకీ వెనక్కీ తిరుగుతూ చలి కాచుకుంటున్నారు జనాలు.
ఎంతని కాచుకుంటే చలి తగ్గుతుంది ? మంట దగ్గరనుంచి వెళ్ళగానే మళ్ళీ మామూలే అనే సూక్ష్మాన్ని గ్రహించినవాళ్లు ఇళ్ళకి బయలు దేరారు.
ఈ లోగా బక్కగా వుండే బ్రహ్మాజీ రావు గారు గుండెలు బాదుకుంటూ భోగి మంట దగ్గరికి వచ్చాడు.
(ఆయన ఎందుకలా వచ్చాడు ? మిగతా సంక్రాంతి జ్ఞాపకాలు మరిన్ని... )
(ఇది నా చిన్నప్పటి పండగ హడావిడి. ఇప్పటికీ అలాగే వుంది. ఎప్పటికీ ఆడే సందడి ఉంటుందని అనిపిస్తోంది. మా అపార్ట్మెంట్ దగ్గర మనస్విని, వంశీ వేసిన భోగి మంట చూస్తే అది హైదరాబాద్ లో కాదు మోరి లో జరిగినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే పండగంటే బేసిక్ ఎమోషన్ ఒకటే ఎప్పటికీ.
గుర్తుపెట్టుకోవాల్సింది.. గొప్పగా చెప్పుకోవాల్సింది.. ఎప్పటికీ మర్చిపోకుండా పంచుకోవాల్సింది... నాకు ప్రతి సంవత్సరం ఎన్నో జ్ఞాపకాలు గుర్తుచేసే మొదటి పండగ ఈ సంక్రాంతి.
అమ్మ తల అంటుతుంటే అవతల ఏవో కొంపలు అంటుకుపోతున్నట్టు కళ్ళు తెరవడం... కళ్ళల్లో పడే కుంకుడుకాయ రసం తాలూకు మంటకి అమ్మ ఓ ఉప్పు కల్లు నోట్లో వేయడం... అమ్మ పసుపు బొట్లు పెట్టి ఇచ్చే కొత్త బట్టలు వేసుకుని పిడకల దండలు చేత్తో పట్టుకుని ఆ మంటలో వేయడం...
ఆ మంట వేడి వెచ్చ ఎప్పటికీ గుండెకి తగులుతూ ఉంటుంది.
ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఎన్ని సూట్ కేసులు సరిపోతాయి ?
అందుకే... షాంపూలకి అలవాటుపడ్డ తలలకి కుంకుడుకాయ రసాన్ని వేసి రుద్దడం అంటే అమ్మని తలుచుకోవడం...
సబ్బులకి అలవాటుపడ్డ శరీరాలకి ఒకసారి నాలుగుపిండి రుచి చూపిస్తే అమ్మని ఇంటికి పిలుచుకోవడం...!!
అంతకన్నా పండగ ఏముంటుంది ?)
మా చిన్నప్పడు జరుపుకున్న భోగీ గుర్తుకువచ్చింది
రిప్లయితొలగించండిమీరు రచించిన "నెమలి కన్ను" కోసం చాలా ప్రయత్నం చేసాను. ఎక్కడ దొరకలేదు. దయచేసి పంపగలర ?
రిప్లయితొలగించండి